Thursday, March 23, 2023
HomeCinema'ఆహా' క‌విస‌మ్రాట్

‘ఆహా’ క‌విస‌మ్రాట్

తెలుగు ర‌చ‌న‌కు వార‌స‌త్వం విశ్వ‌నాథ‌
మాది స‌మీక్ష కాదు ప‌రిచ‌య వాక్యం మాత్ర‌మే
(డాక్ట‌ర్ వైజ‌యంతి పురాణ‌పండ‌, 8008551232)
కవిసమ్రాట్‌ సినిమా రివ్యూ ఏ వాక్యంతో మొదలుపెట్టాలో అర్థం కావట్లేదు.
అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగముతో ప్రారంభించాలా…
కోరిక అయితే జరగదు, సంకల్పం అయితే నెరవేరుతుంది… అనే ఏకవాక్యంతో మొదలుపెట్టాలా…
ఇవేవీ కావు…


ఒక్కడు విశ్వనాథ.. ఒక్కడే విశ్వనాథ…
అని ఆరంభించాలా…
అసలు విశ్వనాథ గురించి వ్రాయటానికి అక్షరాలు సహకరిస్తాయా అనే సందేహం కూడా ఉంది.
ఆయన మీద చలన చిత్రం తీయటానికి పైనుండి విశ్వనాథ వారు సహకరించే ఉంటారు కనుక నేను సమీక్ష వ్రాయటానికి కూడా ఆయన సహకరిస్తారని నా ఆకాంక్ష.
విశ్వనాథ వారి మీద సినిమా తీసిన కుర్రాడికి నిండా మూడు పదుల వయస్సు లేదు. విశ్వనాథ అంటే ఎవరో తెలిసే అవకాశం లేదు. పద్మనాభంగా నటించిన శ్రీఅన్వేష్‌కి విశ్వనాథ వారెవరో తెలియదు. కాని ఆయనను ధైర్యంగా విమర్శించాడు.


ముఖ్యంగా ఎల్‌ బి శ్రీరామ్‌ కవిసమ్రాట్‌గా నటించటానికి సాహసమే చేశారనాలి. విశ్వనాథ వారు ఆరడుగుల ఎత్తయిన విగ్రహం, కోటేరు ముక్కు, వెటకారం ధ్వనించే అందమైన, విలక్షణమైన నాసిక శబ్దంతో మాట్లాడే కంఠస్వరం. మరి ఎల్‌ బి శ్రీరామ్‌ ఈ పాత్రను ఎందుకు వేశారు.
ఆయన చూపినది విశ్వనాథ వారి అంతరంగం, వారి రచనలు.
వారి బాల్యం, విద్యాభ్యాసం, వారి రూపురేఖలు కాదు.


అందుకు ఎల్‌. బి. శ్రీరామ్‌ ను తప్పనిసరిగా అభినందించాలి. పెద్దలు ఆశీర్వదించాలి.
తెలుగువారి కీర్తిని ప్రపంచస్థాయికి తీసుకువెళ్లిన ఘనత విశ్వనాథవారిది.
తెలుగులో మొట్టమొదటి జ్ఞానపీఠ‌ పురస్కారాన్ని అందుకుని, తెలుగు కీర్తిని వేయిపడగలతో విశ్వవ్యాప్తం చేశారు కవిసమ్రాట్‌.
సినిమా విషయానికి వద్దాం…


కోరిక అయితే జరగదు, సంకల్పం అయితే నెరవేరుతుంది…
ఈ వాక్యం మీదే చిత్రమంతా నడుస్తుంది.
విశ్వనాథవారిది సంకల్పం.
సంకల్పసిద్ధిరస్తు… అని ఈ చిత్ర యూనిట్‌ని ఆశీర్వదించి ఉంటారు.
అందుకే సంకల్పం నెరవేరింది.
ఇందులోని కొన్ని అందమైన డైలాగులు..
‘‘అదొక గొప్ప పాత్ర.. ఆ చెయ్యి అక్షయపాత్ర’’
‘‘నా అన్నవాళ్లనిచ్చేది నాన్నే కదమ్మా’’
‘‘మనసు దగ్గర మొదలైన మాట నోటి దగ్గర ఆపేసై’’
‘‘ఇది చదువుతున్నప్పుడు అర్ధాన్ని గమనించాలి’’


‘‘పండితుడికి గర్వం ఉంటుంది’’
‘‘సంకల్పంగా మారిన కోరిక నెరవేరనట్టు దాఖలాలు లేవు’’
‘‘సన్మానాలూ సత్కారాలు ఎవరికి వారు చేసుకునేవి కాదు’’
‘‘నా ప్రత్యర్థులే నాకు బోలెడు పబ్లిసిటీ ఇస్తున్నారు’’
‘‘రాస్తే రావు వ్రాస్తే వస్తాయి’’
‘‘ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది’’
‘‘ఎంత గొప్పగా అనుభవాలు పోగేస్తే, అంత గొప్పగా అక్షరాలు పేర్చగలం’’
‘‘తన రచనలను తన తదనంతరం ముప్పై సంవత్సరాలు కాపాడితే అవి స్థిరంగా నిలిచిపోతాయి’’


ఇవి మచ్చుకి కొన్ని డైలాగులు మాత్రమే.
సినిమా సమీక్ష అంటూ రాయకూడదని నా అభిప్రాయం.
విశ్వనాథ వారు చెప్పినట్లు, ‘తనదైన అనుభూతి తనదిగాన’.
ఎవరి అనుభూతిని వారే అనుభూతి చెందాలి.
ఇది బావుంది, ఇది బాలేదు… అంటూ ఒక అభిప్రాయాన్ని ఇతరుల మనసుల మీదకు రుద్దకూడదు.

ఆర‌డుగుల విశ్వ‌నాథ‌ను త‌న‌లోకి ఆవ‌హింప‌చేసుకున్నారు ఎల్‌.బి. శ్రీ‌రామ్ గారు. ఆహార్యంతో పాటు, హావ‌భావాల‌ను కూడా ప‌లికించారు. ధిష‌ణాహంకారాన్నీ చూపారు.
ఇక్కడ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించిన సవిత్‌ గురించి ఒక్కమాట.
ప్రముఖ సాహితీవేత్త డా. చివుకుల సుందరరామశర్మగారి మనవడు కావటం వల్ల సవిత్‌లోకి ఆ వంశ సంస్కారం గుండె లోతుల్లోకి వ‌చ్చి చేరింది. నాకు తెలిసినంతవరకు చివుకుల వారు కవిసమ్రాట్‌ మీద పరిశోధన చేసిన మొట్టమొదటి వ్యక్తి.
తాత నుంచి ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకుని, తెలుగువారంతా గర్వించేలా ఈ చిత్రాన్ని రూపొందించాడు.
ఇందులో తప్పులు కనపడితే, ఆ కుర్రవాడిని మౌనంగా క్షమించేయండి.
మీకు బాగా నచ్చితే ఆ కుర్రవాడిని బహిరంగంగా ప్రశంసించండి.
అలాగే, సంగీతం. జోశ్య‌భ‌ట్ల స‌మ‌కూర్చిన సంగీతం చిత్రాన్ని శ్ర‌వ‌ణ‌పేయంగా మార్చింది.
ఇది సినిమా రివ్యూ కాదు.
ఇది విశ్వనాథగారి మీద ఉన్న ప్రేమను వ్యక్తపరిచే అక్షరాలు మాత్రమే.
దేశం ప‌ట్ట‌నంత పెద్ద క‌విని నూనూగు మీసాలు కూడా పూర్తిగా రాని యువ‌కులు అర్థం చేసుకుని తెర‌మీద ఆవిష్క‌రింప‌జేసిన ప్ర‌య‌త్నాన్ని ఆద‌రించాలి. ఈ త‌రానికి తెలియ‌ని జ్ఞాన‌పీఠ అవార్డు గ్ర‌హీత‌ను ప‌రిచ‌యం చేయాలి. చిత్రాన్ని త‌మ ఓటీటీలో విడుద‌ల చేసినందుకు అల్లు అర‌వింద్ గారికి త‌ప్పని స‌రిగా కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ