Saturday, September 23, 2023
Homeటాప్ స్టోరీస్అమ్మా భార‌తీ! నీకు వందనం!

అమ్మా భార‌తీ! నీకు వందనం!

(డాక్ట‌ర్ వైజ‌యంతి పురాణ‌పండ‌, 8008551232)
ఆగస్టు 15, ఆజాదీ కా అమృత మహోత్సవ్‌ పురస్కరించుకుని సృజన రచన
భారతదేశమంతా మువ్వన్నెల జండాలతో రెపరెపలాడుతోంది. మూడు రంగులూ ముచ్చటగా ఐకమత్యంతో అనుబంధం పెనవేసుకున్నాయి. భరతమాత అంటే పచ్చటి పొలాలకు, స్వచ్ఛతకు, త్యాగానికి ప్రతీక అని తెలియచేస్తున్నాయి ఆ రంగులు. ఈ రోజు భారతీయులకు ప్రత్యేక సందర్భం. ఆ తల్లికి అమృత మహోత్సవం నిర్వహిస్తున్న శుభసందర్భం…
ఈ సందర్భంగా ఒక సృజన రచన…
తెలతెలవారుతోంది…
భరతమాత ఇంకా నిద్రిస్తూనే ఉంది.
అంతలోనే ఒక రైతు అక్కడకు వచ్చాడు, ఆ వెనుకనే గాంధీతో మరెందరో దేశభక్తులు కూడా వచ్చారు. పసిపిల్లలు తెల్లటి వస్త్రాలు ధరించి, ఛాతీ విరుచుకునేలా మా భరతమాత గొప్పదనం అని చాటిచెప్పేలా బుల్లి బుల్లి మువ్వన్నెల జండాలు గుండెల మీద ధరించి, చేతిలో పెద్ద పెద్ద జాతీయజండాలను పట్టుకుని అక్కడకు వచ్చి తుమ్మెద ఝంకారం చేస్తున్నారు. ‘ఉష్‌! పిల్లలూ! శబ్దం చేయకండి. అమ్మ నిద్రపోతోంది. నేను వెళ్లి నెమ్మదిగా మేల్కొలుపుతాను..’ అంటూ పది పదులు నిండిన ఒక రైతు ఆ తల్లి దగ్గరకు వెళ్లి, ‘బంగారు తల్లీ! మేలుకో తల్లీ! ఈ రోజు నీ అమృత మహోత్సవం. నిన్ను అలంకరించాలి, లేమ్మా, లే’ అంటూ ప్రేమగా మేల్కొలిపాడు.


భరతమాత మేల్కొని, ‘ఈ రోజు నాకు బాగా గాఢంగా నిద్ర పట్టేసింది. స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాను కదా. అందువల్ల అలసట తెలియట్లేదు నాకు’ అంటూ చిరు దర హాసంతో లేచింది.
‘తల్లీ! నువ్వు బందీగా ఉన్నప్పుడు పుట్టాను నేను. ఇప్పుడు నాకు వందేళ్లు, నువ్వు విముక్తురాలవై, కొత్త జన్మ ఎత్తి నేటికి 75 సంవత్సరాలు, నేను నీకు పితృ సమానుడిని. ఈ రోజు నేను నా చేతులతో అలంకరిస్తాను’ అంటూ ఆప్యాయంగా ఆ తల్లి నుదురు ముద్దాడాడు.
పక్కనే ఉన్న గాంధీ తాత బోసి నవ్వులతో, చిన్న పంచె కట్టుకుని, కర్ర చేత పట్టుకుని, భరతమాతకు అభిముఖంగా నిలబడి, ‘తల్లీ! వందనం! నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు తల్లీ, ఆ శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి కూడా ఇన్ని కష్టాలు పడలేదు. కొన్ని వందల సంవత్సరాలు పరాయి వారి పాలనలో బందీగా, బానిసగా ఉండి పడరాని పాట్లు పడ్డావు. నిన్ను చూస్తుంటే మాకు కన్నీరు ఆగేది కాదు. నీ ఆశీర్వాదఫలంగా మేం చేసిన పోరాటంతో విజయం సాధించాం. మళ్లీ నువ్వు కొత్త జన్మ ఎత్తావు తల్లీ’ అంటూ భరతమాత పాదాల ముందు సాష్టాంగపడ్డాడు గాంధీజీ.


ఏమీ ఎరుగనిదానిలా భరతమాత గాంధీజీని లేవనెత్తి, ‘నాయనా! నా కోసం మీరంతా అహోరాత్రాలు ఎంత కష్టపడ్డారో తెలుసునయ్యా! సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గి, వారు పెట్టే అపరిశుభ్ర ఆహారం తింటూ, వారు పెట్టే హింసలు భరిస్తూ, మీ ప్రాణాలను కూడా త్యాగం చేశారని నాకు తెలియదా. నా బిడ్డలుగా పుట్టడం వల్లే మీకు ఇలా జరిగిందని నా తల్లి మనసు ఎంత తల్లడిల్లేదో నాయనా. ఎక్కడా ధైర్యం కోల్పోకుండా, ఎన్ని సంవత్సరాలు నా కోసం పాటుపడ్డారో నాకు తెలియదా. నా ఉనికి తెలిసేలా పింగళి వెంకయ్య రూపొందించిన జండా, నా కోసం వందేమాతరం రచించిన బంకించంద్ర చటర్జీ, జనగణమన రచించిన రవీంద్రుడు.. ఒకరనేమిటి కలం పట్టిన ప్రతివారూ నా బాధలను వివరిస్తూ ఎన్ని రచనలు చేశారో తెలియదా. డప్పు పట్టి ఊరూపా తిరుగుతూ నా విముక్తి కోసం పాటలు పాడినవారిని నేను మరచిపోగలనా. ఎప్పటికప్పుడు నాకు స్వేచ్ఛ లభిస్తోందని సంబరపడుతుండగానే, అంతలోనే పిడుగుల మీద పిడుగుల పడుతూ వచ్చినా, మీలో మొక్కవోని ధైర్యం చూసి నాకు ఆశ్చర్యం వేసేది. నా కోసం ఇంత శ్రమిస్తున్నారా అని తరచు నా తల్లి గుండె తల్లడిల్లుతుండేది’ అంటూ భరతమాత ఆర్ద్రమైన మనసుతో మాట్లాడుతుంటే…
రైతు, గాంధీ తాత తల్లికి ఇరుపక్కల చేరి, పసిపిల్లల్లా ఆవిడను అల్లుకుపోయారు.
ఇదంతా వింతగా చూస్తున్నారు తెల్లకలువల్లా ఉన్న చిన్నారులు.
‘అమ్మా! నీకో విషయం చెప్పాలి. నీ గురించి మేం కష్టాలు పడ్డాం అనుకుంటున్నావు నువ్వు, కానే కాదమ్మా, ఇది కర్మభూమి, ఇది బంగారు భూమి, మంచిమానవత్వాలు ఉద్భవించిన ప్రదేశం, ప్రపంచానికి నాగరకత నేర్పిన పుణ్యభూమి, విశ్వవిద్యాలయాలు ఇలా ఉండాలి అని చాటిచెప్పిన విద్యాభూమి, ఎందరు నీ మీద దాడులు చేసినా, ఈ రత్నగర్భను ఎవ్వరూ ఏమీ చేయలేరని ఎన్నోసార్లు నిరూపించావు తల్లీ నువ్వు, అటువంటి నీ కడుపున పుట్టడం మా పూర్వజన్మ పుణ్యఫలం తల్లీ. ఓంకారాన్ని ప్రసాదించిన తల్లివి నీవు. మా గీర్వాణ భాష మాకు గర్వకారణం తల్లీ. ప్రపంచానికి మంచిని బోధించే వేదాలను, అనునిత్యం జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు ఉపకరించే ఉపనిషత్తులను, మనిషి నిత్యం ఏదో ఒక పని చేస్తూ ఉండాలని తెలియచేసే భగవద్గీతను ప్రసాదించిన తల్లివి నీవు. నిన్ను ఎన్నిరకాలుగా పొగిడినా తక్కువే తల్లీ.


పవిత్ర గంగానది, ఆరోగ్యప్రదాయిన ఆయుర్వేదం, నీఠీవి ఇనుమడించేలా హిమాలయాలు… ఒకటనేమిటి తల్లి, ఈ భూగోళం మీద నిన్ను మించిన నవరత్నాల జనని మరొకటి లేదు కదా. ఎందరో నీ మీద దండయాత్ర చేసి, నీ నుంచి కొన్ని భాగాలను ముక్కలుచేసి వేరే చేసినా, నువ్వు చిరునవ్వులు చిందించావే కాని, రక్తపు బిందువు బయటకు రానీయలేదు. ఇలా చెప్పాలంటే మా మాటలు చాలవు తల్లీ. భారతదేశ మహేతిహాసాలుగా విలసిల్లిన రామాయణభారతభాగవతాలను మాకు ప్రసాదించావు. ప్రపంచంలోనే వీటిని మించిన గ్రంధాలు లేవనేలా నీ బిడ్డలు వాల్మీకి, వ్యాసుడు వీటిని రచించారు. అంతటి మహనీయులకు జన్మనిచ్చావు’ అంటూ పరవశంతో ప్రశంసల జల్లులతో భరతమాతను అర్చించాడు.
పిల్లలంతా చెవులు రిక్కించి, శబ్దం చేయకుండా ప్రతి అక్షరాన్ని ఎంతో జాగ్రత్తగా వింటున్నారు. ‘మన తల్లి ఇంత గొప్పదా. మరిప్పుడు అందరూ మన తల్లి గురించి ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇన్ని కష్టాలు పడి ఆ తల్లిని విముక్తురాలిని చేసి, మళ్లీ ఆవిడ గౌరవానికి చేటు తీసుకువస్తున్నారెందుకు. భారతదేశాన్ని చులకనగా మాట్లాడతారెందుకు. ‘మన ఇండియాలో ఇంతే’ ఆ తల్లి ఔన్నత్యాన్ని తూలనాడుతారెందుకో. మన వల్లే కదా ఆ తల్లికి మంచి పేరు వచ్చినా, చెడ్డ పేరు వచ్చినా’ అంటూ ఓ విద్యార్థి దేశభక్తితో నిండిన మనసుతో ఆవేశంగా పలికాడు.
వచ్చినవారంతా ఆ తల్లిని కొనియాడారు.


ఈలోగా రైతు భరతమాతకు తలంటి స్నానం చేయించి, పట్టు బట్టలు కట్టి, ఆభరణాలతో అలంకరించి తీసుకువచ్చాడు. పిల్లలంతా ఆ తల్లిని అలంకారాలతో చూడగానే, ‘భరతమాతకు వందనం’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. ఆ తల్లి వచ్చి వారందరి మధ్య కూర్చుంది. పిల్లలంతా తమ తమ జేబులలో నుంచి రక్షాబంధనాలు తీసి, తల్లి చేతికి కట్టారు. ఆవిడ పరవశంతో ఉబ్బితబ్బిబ్బవుతూ, ‘నాకు కడుతున్నారేంటి పిల్లలూ, ఆ రైతుకి, మీ బాపూజీకి కట్టండి’ అంటుంటే, అందరూ ముక్తకంఠంతో, ‘తల్లీ నీవే మమ్మల్ని రక్షించే జగజ్జననివి, మేమంతా భారతీయులం అనే పేరు తెచ్చుకున్నాం, అందుకే నీకే ఈ రక్షాబంధనం కడుతున్నాం’ అన్నారు.
భరతమాత మాతృహృదయం ఉప్పొంగింది. కళ్లు ఆనందాశ్రువులతో తడిసి ముద్దయిపోయాయి. అందరినీ అక్కున చేర్చుకుని, తాను స్వయంగా చేయించిన మిఠాయిలు, పిండివంటలను పిల్లలకు, పెద్దలకు అందరికీ తినిపించింది.
అంతలోనే ఎక్కడి నుంచో వేణు గానం వినిపించింది.
ఒక్కసారి ఆ మధురధ్వని వింటూనే, ‘ఈ మధురాధిపతి ఇప్పుడు ఇక్కడు ఎందుకు వస్తున్నాడు’ అనుకుంది ఆ తల్లి.
నల్లనివాడు పద్మనయనాల వాడు అయిన ఆ శ్రీకృష్ణుడు నవ్వురాజిల్లెడు మోముతో భరతమాత పాదాలకు నమస్కరించి, ఆశీర్వదించమన్నాడు.
ఆ తల్లి చిరునవ్వుతో ఆశీర్వదిస్తూనే, కృపారసాన్ని మా మీద కురిపించే నీవు ఈ రోజు నా ఆశీర్వచనం కోసం ఎందుకు వచ్చావు?’ అని ప్రశ్నించింది భరతమాత.
తల్లీ! నీ పుణ్యభూమిలో ప్రభవించాను కాబట్టే నేను కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునునికి గీత బోధించగలిగాను. నీ చల్లని ఒడిలో జన్మించాడు కనుకనే వ్యాసుడు మహాభారతాన్ని రచించగలిగాడు. నీ కటాక్ష వీక్షణాలను తన కనులతో చూసిన వాల్మీకి రామాయణం రచించగలిగాడు’ అని శ్రీకృష్ణుడు పలుకుతుండగా అక్కడకు సీతారాములను వెంటబెట్టుకుని వాల్మీకి, ధర్మరాజాదులను తీసుకుని వ్యాసుడు, భజగోవింద కావ్యంతో శంకరాచార్యుడు, రంఘువంశ మహాకావ్యంతో కాళిదాసు, ఉత్తర రామచరితను చేతబూని భవభూతి, ఎవరికీ కొరుకుడు పడని అనర్ఘరాఘవంతో మురారి మొదలుగా రామాయణ కల్పవృక్షంతో విశ్వనాథ సత్యనారాయణ వరకు అందరూ ఒకరి తరువాత ఒకరు వచ్చారు. వీరితో పాటుగా గాయకులు, క్రీడాకారులు, జానపదులు, వివిధ రంగాలకు చెందిన కళాకారులు… ఒకరనేమిటి ఆ తల్లి పాలు తాగి, ఆ తల్లి ఋణం తీర్చుకున్న ప్రతి ఒక్కరూ ఈ పండుగకు రంగురంగుల కొత్త బట్టలు వేసుకుని వచ్చారు. ‘తల్లీ వందనం’ అంటూ అందరూ ఆ తల్లికి ప్రణమిల్లారు.
‘నా గుండెల మీద ఇందరు మహానుభావులు ఆడుకుంటూ ఇన్ని రచనలు చేసినందుకు నా తల్లి మనసు కరిగిపోతోంది. మీరంతా నాకు పేరు తీసుకువచ్చినందుకు నాకు ఎంతో సంబరంగా ఉంది. నేను ఉన్నంతకాలం మీ పేరు ఈ భూమి మీద చిరస్థాయిగా నిలిచిపోతుంది నాయనా. ఈ రోజు నా అమృత మహోత్సవానికి మీరంతా వచ్చినందుకు ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అని నా వాల్మీకి పలికిన పలుకులు గుర్తు వస్తున్నాయి. నా జన్మదినానికి ఇంతకు మించిన కానుకలు నాకు అవసరం లేదు’ అంటూ అందరినీ ఆశీర్వదించింది.
భారతదేశమంతా మువ్వన్నెల పతాకం రెపరెపలాడుతోంది.
ఆ మాతృహృదయం సకల వర్ణాలతో కిలకిలలాడుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ