కేటీఆర్ వ్యాఖ్యలతో వేడెక్కిన పాలిటిక్స్
కౌంటర్లు – రివర్స్ కౌంటర్లతో నివ్వెరపోయిన పౌరులు
కరెంటు లేదు… రోడ్లు లేవంటూ కేటీఆర్ విమర్శలు
మీ రాష్ట్రం సంగతి చూసుకోండంటూ సజ్జల హితవు
(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి రెండు ముఖ్య సంఘటనలు జరిగాయి. మొదటిదీ… కీలకమైనదీ తెలంగాణ మంత్రి కె.టి.ఆర్. చేసిన ఆంధ్ర వ్యతిరేక వ్యాఖ్యలు. దానికి ఆంధ్ర మంత్రుల కౌంటర్. రెండోది ఆంధ్ర పర్యాటక మంత్రి రోజా తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడం. ఈ రెండూ ఒకే రోజు కలవడం చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రజల భృకుటి ముడిపడేలా చేసింది.
ఏపీలో కరెంటు లేదు… రోడ్లు బాగోలేవు… అక్కడికి వెళ్ళిన వారు తిరిగి హైదరాబాద్ వచ్చిన తరవాత స్వర్గంలో ఉన్నట్లుంది అంటూ ఓ మిత్రుడు చెప్పారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. చాలా రోజులుగా రెండు రాష్ట్రాల మధ్య స్థబ్దుగా ఉన్నరాజకీయాలను ఈ వ్యాఖ్యలు వేడెక్కించాయి.
ఆంధ్ర మంత్రులు ఇందుకు ధీటుగానే స్పందించారు. తాను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ కరెంటు లేదనీ, జనరేటర్ వేసుకోవాల్సి వచ్చిందనీ ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ తన మిత్రుడు చెప్పింది విని ఏపీ మీద విషం జిమ్ముతున్నారనీ, నేను నా అనుభవాన్ని చెబుతున్నాననీ బొత్స అన్నారు.
జోగి రమేష్, తదితరులు కూడా కావాలని ఏపీని అభాసుపాలు చేసేలా కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని అన్నారు.
ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడుగు ముందుకు వేశారు… అయ్యా! ముందు మీ రాష్ట్రం సంగతి చూసుకోండి…తరవాత ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెబుదురు గాని అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఈ వాగ్బాణాల యుద్ధం సాగుతుండగానే పర్యాటక మంత్రి రోజా కుటుంబంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌కు వెళ్ళారు. ఆయనను కలిశారు. కేసీఆర్ చిత్రాన్ని బహుకరించారు. ఇంటికొచ్చిన ఆడపడుచును చూసిన చందంగానే కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కవిత ఆమెకు బొట్టు పెట్టి సత్కరించారు. ఒకవైపు హాట్‌హాట్ వాతావరణం…మరోపక్క ముసిముసి నవ్వుల దృశ్యాలు చూసిన ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు.
ఎందుకిలాంటి పరస్పర విరుద్ధ దృశ్యాలు. వ్యాఖ్యలు. తెలంగాణ కిందటిసారిలాగే ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతోందా? ఇది అందరి మదిలో మెదులుతున్న ఆలోచన.
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టకముందు నుంచి కేసీఆర్ కేంద్రంపైనా ప్రధాని మోడీపైనా నిప్పులు కక్కుతున్నారు. ఇప్పుడు ఆంధ్రపై ఆయన తనయుడు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆంధ్ర కంటే తెలంగాణ నిస్సందేహంగా మంచి స్థానంలో ఉంది. అన్ని రకాలుగా బలిష్టంగా ఉంది. కానీ ఎన్నికలలో లబ్ధి పొందాలంటే ప్రాంతీయతను రెచ్చగొట్టాలి. ఇదీ కేసీఆర్ ఆదినుంచి అనుసరిస్తున్న సూత్రం. కేసీఆర్ ఆంధ్రను ఎంత విమర్శిస్తే… ఎన్నికలలో అన్ని ఓట్లు పడతాయి.
ఈ విమర్శలు కూడా ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెడుతున్న నేపథ్యంలో చేస్తున్నారు. అంటే దీనివెనకలా ఏదో వ్యూహం ఉంది. హైకోర్టు చీఫ్ జస్టిస్‌లతో శనివారం జరిగే సమావేశంలో కేసీఆర్ పాల్గొనడం లేదు.